చిన్నవాడైనా సీఎం జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నా


- ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడం పట్ల ధన్యవాదాలు
- నూరేళ్ల జయంతికి 25 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
- ఏడాదిలోగా పూర్తి చేసి ఆవిష్కరించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
- నిమ్మకూరులో ఏడు కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశం
- జీవితాంతం సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తా
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)


 

గుడివాడ, ఫిబ్రవరి 17: ఎన్టీఆర్ పట్ల చూపుతున్న గౌరవం, మమకారానికి చిన్నవాడైనా సీఎం జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.  విజయవాడ కేంద్రంగా ఉన్న ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసిన దగ్గర నుండి మంత్రి కొడాలి నాని పలు కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ అభిమానులతో కలిసి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఆ సందర్భంగా  స్టేడియంలో ఎన్టీఆర్ అభిమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ నిర్మాణంపై ఎన్టీఆర్ అభిమానులు, గ్రామస్తుల అభిప్రాయం తీసుకున్నారు. నిమ్మకూరులో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.
తాజాగా ఎన్టీఆర్ సమీప బంధువులు, ఆయన  స్వగ్రామం నిమ్మకూరు గ్రామస్తులు, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నిమ్మకూరు గ్రామంలో మంచినీటి పైపులైన్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల నిమిత్తం రూ. 7 కోట్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ను కోరామన్నారు. వెంటనే స్పందించిన సీఎం జగన్ ఆయన అభివృద్ధి పనులు వచ్చే రెండు, మూడు నెలల ప్రారంభమయ్యేలా టెండర్లను పిలవాలని ఆదేశించారన్నారు. వచ్చే మే 28వ తేదీన ఎన్టీఆర్ వందేళ్ళ జయంతి జరుగుతోందని చెప్పారు. నిమ్మకూరు గ్రామాన్ని ఆనుకుని హైవే ప్రాంతంలో 14 ఎకరాల చెరువు ఉందని తెలిపారు. ఈ చెరువులో 25 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ను కోరినట్టు చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని నిమ్మకూరు గ్రామస్తులు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఎన్టీఆర్ కాంస్య  విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే చెరువును సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వచ్చే మే 28 వ తేదీన ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరుగుతుందని, ఏడాదిలోగా పూర్తి చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. గుడివాడ ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ పుట్టి వందేళ్లు నిండిన సందర్భంగా ఆయన పేరుతో జిల్లా, స్వగ్రామంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానిగా ఆయన అభిమానుల తరపున జీవితాంతం సీఎం జగన్ కు కృతజ్ఞతగా రుణపడి ఉంటానని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకే నడుస్తానని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు