ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా ఉండాలి
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి
కాకినాడ ప్రతినిధి,అక్షర లీడర్ ; గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేయాలని.. అదే విధంగా సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్.. రెండో దశ ఎన్నికలు జరిగే రాజమహేంద్రవరం, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలోని అధికారులతో కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల మార్పులపై వచ్చే అభ్యంతరాలు, వాటి పరిష్కారం; ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు; పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు తదితర అంశాలపై సన్నద్ధత ప్రణాళికను 15 మండలాల ఎంపీడీవోల నుంచి అడిగి తెలుసుకున్నారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల నియామకం, వీడియోగ్రఫీలకు ఏర్పాట్లు చేయాలన్నారు. మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్ల ద్వారా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను నిశితంగా పరిశీలించి.. ఇంకా చేయాల్సిన ఏర్పాట్లు ఏవైనా ఉంటే వెంటనే పూర్తిచేయాలని, విద్యుత్, తాగునీరు వంటివాటిపై దృష్టిసారించాలన్నారు. ఎన్నికల సామగ్రి కొరత లేకుండా చూసుకోవాలని అదే విధంగా కోవిడ్ జాగ్రత్తలకు అవసరమైన థర్మల్ స్కానర్లు, మాస్కులు, శానిటైజర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మండల స్థాయిలో నియమితులైన వ్యయ పరిశీలకుల సహాయంతో అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు పరిమితులపై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర విభాగాల సిబ్బందికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి