మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం
- ఆ దిశగానే మౌలిక వసతుల అభివృద్ధికి హెచ్‌డీఎస్ కృషి
- కోవిడ్‌తో పాటు కోవిడేతర వైద్య సేవలకూ అత్యంత ప్రాధాన్యం
- కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడి
- కోవిడ్ సేవల్లో వైద్యుల పనితీరుపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రశంసలు
కాకినాడ (తూర్పుగోదావరి);; కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)లో అవసరాలకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటుచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్ట్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన హెచ్‌డీఎస్ సమావేశం జరిగింది. తొలుత 2020, ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత సమావేశ అజెండాను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు కమిటీ ముందుంచారు. ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఈ-ఆఫీస్ కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక సామాగ్రి, సర్జికల్ స్టోర్ల నిర్మాణం, టీఐఎఫ్ఎఫ్ఏ అల్ట్రా స్కానింగ్ మెషీన్, ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన డయాథెర్మీ మెషీన్ల అవసరం తదితరాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ కమిటీని ఉద్దేశించి మాట్లాడారు. 2020, అక్టోబర్ 8 నుంచి చూస్తే ఆసుపత్రిలో మొత్తం 1,074 పడకలు ఉండగా, వీటిలో కోవిడ్‌కు 605, నాన్ కోవిడ్‌కు 469 అందుబాటులో ఉన్నాయన్నారు. కోవిడ్ క్లిష్ట సమయంలోనూ నిరాటంకంగా అత్యవసర శస్త్రచికిత్సలు జరిగినట్లు వివరించారు. ఒకవైపు కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తూనే, కోవిడేతర వైద్య సేవలకూ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజలు జీజీహెచ్ ద్వారా ఎప్పటిలానే అవసరమైన వైద్య సేవలు పొందొచ్చని వెల్లడించారు. ప్రతి విభాగం ద్వారా పూర్తిస్థాయిలో కోవిడేతర వైద్య సేవలు అందించడంపై విభాగాధిపతులు దృష్టిసారించాలన్నారు. సమావేశంలో ఆసుపత్రిలో మౌలిక వసతులకు సంబంధించి కొందరు సభ్యులు ప్రస్తావించిన అంశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.
వైద్యులకు ఎంపీ, ఎమ్మెల్యేల ప్రశంసలు:
కోవిడ్ క్లిష్ట సమయంలో, ఎంతో ఒత్తిడి వాతావరణంలో వైద్యులు అందించిన సేవలు మరవలేనివని ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే డి.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. రాత్రిపగలూ అని తేడాలేకుండా, విసుగన్న మాటే లేకుండా వైద్యులు పనిచేశారన్నారు. ప్రజలందరి తరపున వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో అత్యధిక కేసులున్నప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా కలెక్టర్ నేతృత్వంలో వైద్యాధికారులు మెరుగైన పనితీరు కనబరిచారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.బాబ్జీ, కమిటీ సభ్యులు బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి