
అమలాపురం,అక్షర లీడర్ ;జిల్లా లో ఆక్వా రైతులు మీ సేవా ద్వారా పెట్టుకున్న దరఖాస్తులకు నిబంధనలను అనుసరించి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి. కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా అమలాపురం ఎత్రవంతెన వద్ద ఓం ఎంటర్ ప్రైజేస్ భవనంలో కోనసీమలోని ఆక్వా రైతులు తో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు కారణంగా జిల్లా లో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడం జరిగిందని, రొయ్యల హేచరీలు నాణ్యమైన రొయ్య విత్తనాలను ప్రభుత్వం సూచించే ధరకు విక్రయించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జే.డి. తెలిపారు. స్థానిక మార్కెట్ల లో మనం పండించే రొయ్యలు, చేపలు అమ్మకాలు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మన దేశం లోని చేపల ఉత్పత్తి లో మన రాష్ట్రం రెండవ స్థానంలో వుందని, అలాగే చేపల సాగులో కూడా మన జిల్లా ఆశాజనకంగా వుందని జాయింట్ డైరెక్టర్ అన్నారు. ప్రేరేపిత అం డోత్పత్తి సృష్టికర్త ప్రొఫెసర్ డా. హీరాలాల్ చౌదరి దేశీయ మరియు విదేశీ కార్ప్ చేపల హార్మోనల్ బ్రీడింగ్ పై చేసిన విశేష కృషి ఫలితంగా ఈరోజున మనం జాతీయ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జే.డి. తెలిపారు. హీరాలాల్ చౌదరి 1957 లో ప్రేరేపిత అండోత్పత్తి కనుగొని నీలి విప్లవానికి నాంది పలికారని జే.డి. తెలిపారు. అలాగే ఆక్వా పరిశ్రమకు సంబంధించి ఆక్వా రైతులు,డీలర్లు, మత్స్య కారులు, మత్స్య వ్యాపారులు కరోనా విపత్తును దృష్టిలో వుంచుకొని తప్పనిసరిగా మాస్క్ లు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు , వై యస్ ఆర్ నాయకులు చెల్లు బోయిన శ్రీనివాస రావు మాట్లాడుతూ ఆక్వా రైతులు మీసేవ ద్వారా చేసుకున్న పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను సత్వరం పరిశీలించి త్వరిత గతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఆక్వా రైతు చవటపల్లి నాగభూషణం మాట్లాడుతూ స్థానిక మార్కెట్లలో చేపలు, రొయ్యలు అమ్మకాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలని జే.డి.ని కోరారు. అలాగే హేచరీల నుండి ఉత్పత్తి అయిన నాణ్యమైన వనామీ రొయ్య విత్తనాలను ప్రభుత్వం సూచించిన ధరకు ఆక్వా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఆక్వా రైతు గుండేపూడి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్ సమయంలో రొయ్యలు, మరియు చేపలకు సరైన గిట్టుబాటు ధర అందించి ఆక్వా రైతులను ఆదుకున్నారని కొనియాడారు.అలాగే జిల్లా లో మత్స్య శాఖ యంత్రాంగం లాక్ డౌన్ సమయంలో ఆక్వా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విశేషమైన కృషి చేసి రైతులకు అండగా నిలిచారని కొనియాడారు. ముందుగా ప్రేరేపిత అండోత్పత్తి సృష్టి కర్త ప్రొఫెసర్ డా. హీరాలాల్ చౌదరి చిత్రపటానికి జే.డి.మరియు ఆక్వా రైతులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆక్వా సాగు లో విశేషమైన కృషి చేసిన రైతులు రాజులపూడి శ్రీపతి, సామంతకుర్తి వెంకట జగన్నాథ రాజు లను జే.డి. సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ ఆక్వా రైతులు అల్లూరి రమేష్ రాజు, ఓం రవి, అమలాపురం మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆర్.వి.ఎస్.వి.ప్రసాద్, మత్స్య శాఖ అభివ్రుద్ది అధికారి సి.హెచ్. గోపాల కృష్ణ, ఎఫ్.డి. ఓ లు సి.హెచ్. చిన వెంకటరావు, సి.హెచ్.రాంబాబు, ఎస్. సంజీవరావు, నాగబాబు, శ్రీనివాసరావు, మరియు మత్స్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి