క్లిష్ట పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం

తూర్పు గోదావరి ;;కోవిడ్- 19 వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రెడ్ క్రాస్ సంస్థ అత్యున్నత సేవలు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, యూత్ ఫర్ సర్వీస్ వారిచే ఏర్పాటు చేయబడిన రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎలాంటి కొరత లేకుండా ఉచితంగా రక్తం అందించిందని రాష్ట్ర గవర్నర్ ప్రశంసించడం జిల్లా రెడ్ క్రాస్ సంస్థ యొక్క గొప్ప కృషి అని అన్నారు.


అదేవిధంగా రానున్న రోజుల్లో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనంతరం 2019 - 20 సంవత్సరం లో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అత్యధికంగా రక్తదానం అందించిన వివిధ సేవా సంస్థలు ప్రతినిధులను కలెక్టర్ సన్మానించారు. తూర్పు గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వై.డి.రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రెడ్ క్రాస్ సంస్థలన్నింటిలో కెల్లా ఎక్కువ రక్త నిల్వలు ఉన్న సంస్థగా తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ప్రశంసలు అందుకుందన్నారు. జిల్లాలో 2019-20 సంవత్సరానికి గాను జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ రాజమండ్రి వారు ఒకే రోజు 408 యూనిట్లు రక్తాన్ని అందించారన్నారు. అదేవిధంగా ఆదిత్య విద్యా సంస్థలు నాలుగు క్యాంపు ద్వారా 548 యూనిట్లు, రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా 260 యూనిట్లు, ఓఎన్ జిసి సంస్థ ద్వారా 301 యూనిట్లు మరియు వివిధ పోలీసు శాఖల ద్వారా 298 యూనిట్లు రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థకు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా కాకినాడకు చెందిన బాదం బాలకృష్ణ అత్యధికంగా 78 సార్లు రక్తదానం చేశారని ఆయన తెలిపారు. తొలుత జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి వారం రోజుల పాటు రక్తదానం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే మొబైల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో ఓ ఎన్ జి సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవింద్ మోర్బలే, ఆదిత్య విద్యా సంస్థల నుండి ఎన్.సతీష్ రెడ్డి, రిలయన్స్ సంస్థ నుండి పి.సుబ్రహ్మణ్యం, జిల్లా పోలీసు శాఖ నుండి సబ్ ఇన్స్పెక్టర్ కె.భీమారావు, రెడ్ క్రాస్ కార్యదర్శి కె.శివకుమార్, రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణాధికారి ఎస్.మల్లేశ్వరరావు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు