రైతు పండించిన ప్రతీ పంటకు గిట్టుబాటు ధర;;రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెస్సింగ్ శాఖామంత్రి కురసాల కన్నబాబు
తూ .గో ;; రైతు పండించిన ప్రతీ పంటకు గిట్టుబాటు ధర చెల్లించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెస్సింగ్ శాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గం విరవాడ గ్రామంలో రైతులు పండించిన కూరపెండ్లం (పెద పెండ్లం) కొనుగోలు కార్యక్రమాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబులతో కలిసి మంత్రి కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుండి వైద్య, ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో అట్టి విధంగానే వ్యవసాయ అనుబంధ రంగాలకు, రైతులు పండించిన పంటను మార్కెట్ చేయడంలోను సమ ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఏ రైతూ ఎటువంటి పంట పండించిన తప్పనిసరిగా ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధర అందించడం ప్రభుత్వ బాధ్యత అని దాని వల్ల అదనపు భారం పడినా పర్వాలేదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా తొందరగా పాడయ్యే తాజా కూరగాయల రకాలను మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం విరవాడ గ్రామం పరిసర మెట్ట ప్రాంతాల్లో రైతులు పండించిన కూరపెండ్లం ఒరిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుందన్నారు. కరోనా వైరస్ కారణంగా కూరపెండ్లం కొనుగోలులేక రైతు పడుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళగా వెంటనే స్పందించి ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కూరపెండ్లంను ప్రభుత్వం కిలో రూ.13 లకు రైతుల పొలాల వద్దకే వెళ్లి కొనుగోలు చేసి, ఆర్టీసీ బస్సుల ద్వారా విశాఖపట్నం రైతు బజార్లకు, ఇతర మార్కెట్లకు మార్కెటింగ్ శాఖ ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. వినియోగదారునికి తక్కువ ధరకు అమ్మడంతో పాటు మరోపక్క పండించిన రైతుకు లాభం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అదనపు భారాన్ని భరించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అరటి, బత్తాయి,టమాట,ఉల్లి, కూర పెండ్లం, అరకు బజ్జి మిర్చి, చిత్తూరు జిల్లాలో బూడిద గుమ్మడి కొనుగోలు చేయడం లేదని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళగా వెంటనే కొనుగోలు చేయాలని తెలిపారన్నారు. భవిష్యత్ లో కూరపెండ్లం సాగు రైతులకు, కౌలు రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, నిల్వచేయడం, మార్కెట్ చేసుకొనే వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత రైతులకు ధర చెల్లించి కూరపెండ్లంను కొనుగోలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న రైతులను వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ కారణంగా కూరపెండ్లం కొనుగోలు కాక రైతులు పడుతున్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా, మంత్రి కన్నబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేసారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రికి రైతుల పక్షాన ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి వెంబడి ఉద్యానశాఖ డిడి రామ్ మోహన్, ఎడి మార్కెటింగ్ కెవిఆర్ఎస్ కిషోర్ , పిఠాపురం వ్యవసాయ శాఖ ఎడి కె.నాగేశ్వరరావు, ఏవో ఎ.అచ్యుతరావు, ఏడిహెచ్ రమణ, తహశీల్దార్ కె.వరహాలయ్య, హెచ్ ఓ శైలజ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి