*ఆదివాసి పాఠశాలల్లో ఆదివాసి ఉపాధ్యాయులకు నూరు శాతం రిజర్వేషన్లు సరైనవే.


ఆదివాసులు నివశించే షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో నూరు శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతున్న నిబంధనల్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం సామాజిక న్యాయ లక్ష్యానికి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులు నివశించే షెడ్యూల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల్లో ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిబంధనలు జారీ చేసి అమలు జరిపింది. అదే నిబంధనలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ ఆధిపత్య శక్తులు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం నిబంధనలను కొట్టివేసి రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు చెప్పింది. 


   ఆదివాసి విద్యార్థులకు ఆదివాసి ఉపాధ్యాయుడే పాఠాలు చెప్పాలా అని న్యాయస్థానం ప్రశ్నించింది. నూరు శాతం రిజర్వేషన్ వల్ల ఇతర సామాజికవర్గాలు అవకాశాలు కోల్పోతున్నాయని ఆక్షేపించింది. ఇతర రిజర్వేషన్ వర్గాలైన ఎస్సీ, బీసీలకు ఇది నష్టం అని తన తీర్పును కోర్టు వ్యాఖ్యానించింది. 
    అయితే ఆదివాసీ ప్రజలు నాగరిక సమాజానికి దూరంగా విసిరి వేయబడి కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవితాన్ని అనుభవిస్తూ మైదాన ప్రాంతాలకు చెందిన వాణిజ్య పారిశ్రామిక వర్గాల దోపిడీకి గురవుతూనే సామాజిక భాగస్వామ్యం లేకుండా భయంకరమైన బానిసత్వానికి లోనవుతున్నారు. 


ఆదివాసి పిల్లలకి ఆదివాసి ఉపాధ్యాయుల చదువు చెప్పడం న్యాయమే గాక అవసరం కూడా. ఆ విద్యార్ధులకు అర్ధమయ్యే భాషలో, రీతిలో ఆదివాసి ఉపాధ్యాయుడు అయితే సమర్థవంతంగా విద్య నేర్పించగలుగుతారు. అక్కడ ఆదివాసీలు, మైదాన ప్రాంతాలు అనే అంతరాలు లేకుండా సమానత్వ భావంతో విద్యార్థులు ఉపాధ్యాయులు మెలుగుతారు. విద్యార్థులు కూడా స్వేచ్ఛగా నిర్భయంగా చదువు నేర్చుకోగలుగుతారు. మైదాన ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులలో ఆదివాసీల కన్నా తాము గొప్పవారమనే అధిక్యతా భావం ఉండదని చెప్పగలమా ?


ఇక ఆదివాసేతరులకు మైదాన ప్రాంతాల్లో ఉపాధ్యాయ తదితర ఉద్యోగావకాశాలు ఎలాగూ ఉంటాయి. ఆ హక్కులకు ఆదివాసీలు నూరు శాతం రిజర్వేషన్ల విధానం బంగకరమైనదేమీ కాదు కనుక ఈ నూరు శాతం రిజర్వేషన్లు ఎస్సీ, బిసిలకు నష్టమని పేర్కొనడం ద్వారా ఎస్సీ, బీసీల మనోభావాలను కోర్టు అర్థం చేసుకోలేదు అని చెప్పాల్సి వస్తుంది.


సామాజిక న్యాయ సూత్రాన్ని అనుసరించి తమ తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాలి. దేశ జనాభాలో ప్రస్తుతం ఎస్సీలు 20 శాతం వరకు ఉన్నారు కనుక వారికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలు 50 శాతానికి మించి ఉన్నారు కనుక కనీసం 50 శాతం రిజర్వేషన్లు వారికి కల్పించాలి. ఆదివాసీలు దేశ జనాభాలో 7 శాతం ఉన్నారు కనుక 7 శాతం కల్పించాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వారు నూరు శాతం ఉన్నారు గనుక నూరు శాతం రిజర్వేషన్లు కల్పించాలి ఇదే సామాజికన్యాయం. సుప్రీంకోర్టు తీర్పులో చెప్పినట్లుగా ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీల నూరు శాతం రిజర్వేషన్లు ఎస్సి,బిసిలకు నష్టకరమైనది కాదు. పైగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్న వాదనను ఎస్సీ, బీసీలు బలపరుస్తున్నారు. అదే సమయంలో భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు నిర్ణయం కూడా సరైంది కాదని స్పష్టం చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50 శాతం మించకుడదు అన్న నిబంధనలు ఏమీ లేనేలేవు అనే పరమ సత్యాన్ని సుప్రీంకోర్టు తన తీర్పులో విస్మరించింది. ఇలాంటి కారణాల వల్లనే ఆదివాసీలకు రాజ్యాంగంలోనే రిజర్వేషన్లు కల్పించారనే వాస్తవాన్ని పరిశీలించడంలో న్యాయస్థానం విఫలమైంది. దేశం మొత్తం జనాభాలో 7 శాతంగా ఉన్న ఆదివాసీలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించారు. అయితే ఆదివాసీ ప్రాంతాల్లో మొత్తం జనాభా ఆదివాసీలే గనుక వారికి నూరు శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇది జనాభా దామాషా సూత్రాన్ని అనుసరించి రూపొందించినదే కనుక రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయ లక్ష్యానికి అనుగుణమైనదే. 


 అదే తీర్పులో సుప్రీం కోర్టు ప్రధాన చర్చనీయాంశమైన ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా గత ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు అవుతున్న తీరుతెన్నులు కూడా ప్రస్తావించింది. రిజర్వేషన్లు ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్లు ఆయా కులాల్లోని అభివృద్ధి చెందిన విభాగానికే పరిమితమై పోతున్నాయని అందుమూలంగా అలజడి, వివాదాలు, సంఘటనలు జరుగుతున్నాయని తన తీర్పులో కోర్టు పేర్కొన్నది. అందుకు పరిష్కారంగా గ్రూపులోని కులాల పొందిక లో మార్పులు చేయాలని కూడా తీర్పులో కోర్టు అభిప్రాయపడింది. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సుప్రీం కోర్టు వద్ద ఉన్న డేటా (గణాంకాలు) కానీ వివిధ కమిషన్లు సమర్పించిన నివేదికలు కానీ ప్రస్తావించలేదు. 


  అంతేగాక రిజర్వేషన్లు ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానంలో అత్యధికంగా లబ్ధి పొందుతున్న వారు గానీ, సరైన న్యాయం జరగని విభాగాలు కానీ కోర్టు విచారించిన పిటిషన్లో కోర్టు ఎదుట వాదులుగా కానీ, ప్రతివాదులుగా కానీ లేరు. అలాంటి వారి వాదనలు వినకుండానే సుప్రీంకోర్టు ఏకపక్షంగా కొన్ని అభిప్రాయాలకు వచ్చి వ్యక్తం చేయడం ఎంతవరకు సబబు. అసలు ఈ అంశం ప్రధానాంశం పై తీర్పు చెప్పే సందర్భంలో ప్రస్తావించవలసిన ప్రస్తుతాంశాలు కావు. అప్రస్తుతంగానూ,  అసందర్భంగాను అలాంటి భావనలు సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేయడం సరైనది కాదు.


ఏమైనా సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు పైన ఆదివాసీలు, బిసిలు, ఎస్సీలు రివ్యూ పిటిషన్ వేసి ఆదివాసీల నూరు శాతం రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా రాజ్యాంగ బద్ధత లేని 50 శాతం సీలింగ్ పై కూడా సుప్రీం కోర్టులో సవాల్ చేసి రద్దు చేయించుకోవాల్సిన అవసరం, తద్వారా సామాజిక లక్ష్యాన్ని సాధించ వలసిన ఆవశ్యకత బహుజనుల పట్ల ఎంతైనా ఉన్నది.
 
వ్యాసకర్త: పగిడాల ఆనంద్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడు, బిసి స్టూడెంట్ ఫెడరేషన్.
పరిశోధక విద్యార్థి, మహాత్మా ఫూలే అధ్యయన కేంద్రం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు