వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు సడలింపు ;;మంత్రి పిల్లి
తూ. గో ;;కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సడలింపు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మంగళవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట పంచాయతీ పరిధిలోని గోలుపాడు, రాయుడు పాలెంలలో కరీనా వైరస్ నివారణ ద్రావణం సోడియం హైపోక్లోరైడ్ పిచికారీని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్న బాబు, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతలు కలిసి ప్రారంభించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరు గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగాల పనులను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ లాక్ డౌన్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం సడలింపు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు తక్షణమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దన్నారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మోసపోవడం తప్ప మోసం చేయడం తెలియని వాడు రైతు మాత్రమేనని అటువంటి రైతును అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్న బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పరిస్థితులను పరిశీలించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కాకినాడ రూరల్ ప్రాంతంలో మామిడి, మామిడికి సంబంధించిన ఉత్పత్తి పెద్దఎత్తున చేయడం జరుగుతుందని, ప్రధానంగా మామిడి జ్యూస్, మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కరీనా కారణంగా రైతులు తమ ఉత్పత్తులు ఏవిధంగా అమ్ముకోవాలనో అని ఆందోళనలకు గురవుతున్నారని,వారికి భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ క్షేత్ర స్థాయి పర్యటనలు చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమలకు, అందులో పనిచేసే వారికి ఎటువంటి అడ్డంకులు కలిగించవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులు కావాల్సి వస్తే ఇతర జిల్లాల కార్మికులకు కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆక్వా, పౌల్టీ ఉత్పత్తులకు ఎటువంటి మద్దతు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ రంగానికి పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, తాను రైతు పక్షపాతి అని ఇదివరకే ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులకు మేలు చేయడం కోసం ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనుకడుగు వేయడం లేదన్నారు. గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా కొంత పంట దెబ్బతిందని ప్రధానంగా వరి పంట తూర్పు గోదావరిలో ఎక్కువగా దెబ్బతిందని అన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఆ ప్రకారంగానే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఆధునీకరించడం జరుగుతుందన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ అనుబంధ రంగాలు పెద్ద ఎత్తున పెరిగినట్లయితే గ్రామీణ ఉపాధి అవకాశాలు మెరుగుపడి, గ్రామీణ ఆర్థిక రంగానికి ఊతం ఇస్తుందన్నారు. మామిడి తాండ్ర తయారీదారులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా తమ కార్యకలాపాలు చేసుకోవచ్చన్నారు. మామిడి ధరలు పడిపోకుండా పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రైతులకు తప్పనిసరిగా మద్దతు చెల్లించే విధంగా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం పండూరు గ్రామంలో మామిడి తాండ్ర తయారీ యూనిట్ ను మంత్రులు,ఎంపీ ప్రారంభించి,పచ్చళ్ళ తయారీ విధానాన్ని, మామిడి తాండ్ర యూనిట్లను పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి కన్న బాబు పరిశీలించారు. రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇతర అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ కాకినాడ రూరల్ మండల ఎంపీడీవో పి.నారాయణ మూర్తి, పండూరు గ్రామ పంచాయితీ కార్యదర్శి లక్ష్మీదేవి, రూరల్ సిఐ మురళీకృష్ణ, రైతులు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి