అధికారుల నిబంధనలను తుంగలో తొక్కిన శంఖవరం నిత్యావసర సరుకుల దుకాణాలు......

నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద ధరల పట్టిక లెక్కడ?

పేదల జేబులు కొల్లగొడుతున్న వైనం....

                                                                                                            తూర్పు గోదావరి ;;శంఖవరం, అక్షర లీడర్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో నిత్యావసర సరుకుల షాపులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తెరవాలని, అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని, షాపు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని అధికారులు నిబంధనలను జారీ చేస్తే శంఖవరంలో ఆ నిబంధనలను తుంగలో తొక్కిన వైనమిది.

లాక్ డౌన్ కారణంగా గత నెల రోజులుగా ఏ పనులు చేయడానికి వీలు లేక గడవటమే కష్టంగా ఉన్న ఈ సమయంలో ఉన్న కాస్త డబ్బులు కేవలం నిత్యావసర సరుకులకే పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ తరుణంలో రేట్లు పెంచినా ఎవరూ పట్టించుకోరు అనే ధైర్యంతో శంఖవరం నిత్యావసర సరుకుల దుకాణాలలో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి పేదల ఇల్లు గుల్ల చేస్తున్నారు. ప్రక్కనున్న కత్తిపూడి లో కిలో పంచదార 40 రూపాయలు ఉండగా, శంఖవరం లో 45 రూపాయలు విక్రయిస్తున్నారు. అదేవిధంగా అన్ని సరుకుల మీద కిలో కి ఐదు రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారు. ఈ విషయం మీద అధికారులు కూడా ఇప్పటివరకు శంఖవరం కిరాణా షాప్ ల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు సరి కదా! కనీసం ఏ షాపు వద్ద కూడా ధరల పట్టిక పెట్టిన దాఖలాలు లేవు. కొన్ని షాపులలో అయితే ఉదయం 9 గంటల లోపు ఒక రేటు, తొమ్మిది దాటిన తర్వాత మరొక రేటు సరుకులు విక్రయిస్తున్నారు.అలాగే నిత్యావసర సరుకుల షాపులు కాకపోయినా పాన్ షాప్ ల వద్ద ఇంతకుముందే మామూలు రోజులలోనే బ్యాన్ చేసినటువంటి గుట్కా, పాన్ పరాగ్, ఖైని వంటి ప్యాకెట్లు ఒక్కొక్కటి 15 రూపాయలు రేటు ఉంటే, జనాల వ్యసనాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అది తక్కువలో తక్కువ  60 నుండి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కరోనా వైరస్ కంటే ఈ గుట్కావైరస్ శంఖవరంలో విలయ తాండవం చేస్తుంది. మామూలుగా షాపులు రోజంతా తెరచి అమ్మిన లాభాల కంటే, లాక్ డౌన్ లో రేట్లు పెంచి ఒక గంటలో అమ్మే లాభాలే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అయినా అడిగే నాథుడు ఎవరూ లేరు. ఇకపై అధికారులు చొరవ చూపి నిత్యావసర షాపుల వద్ద కనీస ధరల పట్టికను ఏర్పాటు చేసి, ఖైనీ,గుట్కా వంటి మారక ద్రవ్యాలను రూపుమాపి ఆదుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు