పూల విక్రయాలకు అనుమతులు
తూ.గో ;;చామంతి, బంతి, లిల్లీ, మల్లి, గులాబి, కనకాంబరాలు తదితర పూల అమ్మకాలు, రవాణా కు అవసరమైన అనుమతి పత్రాల కొరకు రైతులు సమీప ఉద్యాన అధికారి, గ్రామీణ ఉద్యాన సహాయకులను సంప్రతించాలని ఉద్యాన వన శాఖ ఉప సంచాలకులు ఎస్.రామ్మోహనరావు ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో కడియం, ఆలమూరు మండలాల పరిధిలో సుమారు 272 హెక్టార్లలో రైతులు పూల తొటలు సాగు చేస్తున్నారని, కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా వీరి ఉత్పత్తులకు నష్టం కలుగుకుండా పూల విక్రయం, రవాణా అంశాలలో అవసరమైన అనుమతుల జారీకి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలియజేశారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు కడియపు లంక పూల మార్కెట్ వద్ద, రాజమండ్రి, ఆలమూరు, మండపేట రైతు బజార్ల వద్ద రోజూ ఉదయం 6 గం.ల నుండి 9 గం.ల వరకూ పూల విక్రయాలను జరుపుకుంటున్నారని, జిల్లా, రాష్ట్ర్రేతర ప్రాంతాలకు రవాణాకు ఉద్యాన వన అధికారులు వెహికిల్ పర్మిషన్లు జారీ చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకూ జిల్లా నుండి విజయవాడ, చెన్నై, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రాంతాలకు పూలు రవాణా చేసేందుకు 24 టన్నుల మేరకు రవాణా అనుమతులను జారీ చేయడం జరిగిందన్నారు. కావున పూల సాగు ఉద్యాన రైతులు లాక్ డౌన్ కారణంగా నష్టపోకుండా కల్పిస్తున్న అనుమతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి