
కరోనా ఉందంటూ స్థానికులు అనుమానించడంతో ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. తనను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మనస్థాపానికి గురై.. రైలు కింద పడి చనిపోయాడు. తమిళనాడులోని మధురై జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురైలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి కేరళలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో పని దొరకకపోవడంతో ఎలాగోలా కొన్ని రోజుల క్రితం సొంతూరికి చేరుకున్నాడు. అప్పటి నుంచి తల్లీ వద్దే ఉంటున్నాడు. ఐతే అతడికి దగ్గు, జ్వరం రావడంతో స్థానికులు అప్రమత్తం చేశారు. అంతేకాదు పోలీసులు, స్థానిక వైద్యఅధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో స్థానికులే ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన పరీక్షలకు పంపించారు.డాక్టర్లు అతడి శాంపిల్స్ సేకరించి తిరిగి ఇంటికి పంపించారు. బయటకు వెళ్లకూడదని, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఐతే అంతలోనే.. అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతడి పేరు, ఊరు సహా అన్ని వివరాలను బయటకు తెలియడంతో.. స్థానికుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఓ వైపు కరోనా భయం, మరోవైపు తన గురించి చెడు ప్రచారం జరుగుతుండడంతో.. అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కప్పలూరు సమీపంలోని రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఐతే అతడు చనిపోయాక ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చాయి. పరీక్షల్లో అతడికి నెగెటివ్ ఉన్నట్లు తేలింది. స్థానికులు దుర్భాషలాడడం వల్లే తన కుమారుడు చనిపోయాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. కాగా, తమిళనాడులో ఇప్పటి వరకు 309 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్క రోజే 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు 309 కేసులు నమోదైతే.. అందులో 264 మంది ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారే ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి