
సంక్రాంతికి వచ్చే సినిమాలను సాధారణంగా థియేటర్లకు వెళ్లి ఎక్కువగా చూస్తారు. ప్రస్తుతం పైరసీ కూడా ఎక్కువైపోయింది కాబట్టి థియేటర్‌లోకి వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే హెచ్‌డీ క్వాలిటీతో ఆన్‌లైన్‌లో సినిమాలు దొరికేస్తుంది. సినిమా విడుదలైన 30 రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక ఆ తరవాత టీవీల్లో వస్తే ఎవరు చూస్తారు అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ, ఇది కరెక్ట్ కాదని సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ నిరూపించింది.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. ఈ హెచ్‌డీ ప్రింట్‌ను కొంత మంది ఫేస్‌బుక్‌లో కూడా పెట్టేశారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాను చూసేశారు. అయినప్పటికీ ఇటీవల జెమిని టీవీలో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు.ఉగాది కానుకగా మార్చి 25న సాయంత్రం 6 గంటలకు ‘సరిలేరు నీకెవ్వరు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను జెమిని టీవీ ప్రసారం చేసింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో టెలివిజన్ వ్యూవర్‌షిప్ రేటింగ్ (టీవీఆర్) వచ్చింది. 23.4 టీవీఆర్‌ను ‘సరిలేరు నీకెవ్వరు’ సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇదే అత్యధిక టీవీఆర్. గతంలో ‘బాహుబలి 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు 22.7 టీవీఆర్ రాగా.. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ దాన్ని దాటేయడం విశేషం. అంతేకాదు.. గడిచిన 15 ఏళ్లలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో టీవీఆర్ రాలేదు.అయితే, ఈ సినిమా రికార్డు స్థాయిలో టీవీఆర్ రావడానికి బలమైన కారణమే ఉంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరమితమయ్యారు. దీంతో ఎక్కువ సమయం టీవీకే కేటాయిస్తున్నారు. అందుకే, ఈ కొత్త సినిమా కాబట్టి ‘సరిలేరు నీకెవ్వరు’ను ఎగబడి చూశారు. కారణం ఏదైనా మహేష్ బాబు బుల్లితెరపై ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పడం విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి