రూ .100 లకే ఫ్రూట్ కిట్ ;;మామిడి పంటను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు... మంత్రి కన్నబాబు

ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో మామిడి దిగుబడులు అధికంగా ఉంటుందని ఉద్యావన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారని, దానికి అనుగుణంగా రైతులకు మేలు కలిగే విధంగా మామిడి పంటను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మంగళవారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద రూ.100 లకే ఫ్రూట్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున మామిడికాయల ఎగుమతి కొరకు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. రెండు రోజుల క్రితం విశాఖపట్నం నుండి 140 టన్నల మామిడికాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరిగిందన్నారు. అదే విధంగా తిరుపతి నుండి 1.2 టన్నుల మామిడికాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు పండించిన పంట తగిన గిట్టుబాటు ధరకు అమ్మే విధంగా చర్యలు తీసుకొనుచున్నట్లు ఆయన తెలిపారు. వంద రూపాయలకే ఐదు రకాల పండ్లను మొదటి దశలో అన్ని పురపాలక సంఘాలకు, కార్పొరేషన్ల వినియోగదారులకు చౌకగా పండ్లను అందించుటకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం  ఇప్పటికే కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ప్రారంభించినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో మొదటిగా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలో వంద రూపాయలకే పండ్ల కిట్ అందజేయడం జరుగుతుందన్నారు. దశలవారీగా అన్ని గ్రామాలకు కూడా  ఈ ప్రక్రియను విస్తరింపజేయడం జరుగుతుందన్నారు. దీని వలన రైతులకు ధర ఇవ్వడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన పండ్లు అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఇంటింటికీ పండ్ల కిట్ లను అందజేసే స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా కొంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందన్నారు.వంగా గీతా విశ్వనాధ్ మాట్లాడుతూ కరోనా పరిస్ధితులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రైతాంగానికి ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకొనుచున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షిస్తూ వరి, కూరగాయలు, మొక్కజొన్న, పండ్లు మొదలగునవి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ, కరోన వలన వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నందుకు పార్లమెంటు సభ్యురాలు మంత్రిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డిడి ఎస్.రామ్మోహన్, ఏడి బి.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.


                            


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు