ప్రజలు వ్యక్తి గత శుభ్రత ,ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి

తూ. గో ;  వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలను పాటించి కరోనా వైరస్ దరికి చేరకుండా సమర్థవంతంగా నిరోధించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం కలెక్టరేట్ స్పందన సమావేశ హాలులో కరోనా వైరస్ సోకకుండా నిరోధించేందుకు చేపట్ట వలసిన జాగ్రత్తల పై కలెక్టరేట్ అధికారులు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి హాజరై కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఉద్యోగులు, ప్రజలు చేపట్టవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఇంటింటి సందర్శన ద్వారా జిల్లాలో 95 శాతం ప్రజలను వైద్య,ఆరోగ్య సిబ్బంది స్క్రీనింగ్ ఇప్పటికే పూర్తి చేసారని, 21 అనుమానిత కేసులకు లాబో రేటరీలలో పరీక్షలు నిర్వహించగా అన్నిటిలో కోరోనా వైరస్ నెగెటీవ్ అని తెలిందన్నారు. విదేశాల నుండి జిల్లాకు చేరుకున్న 630 మంది వ్యక్తులందరికీ నూరు శాతం స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. జిల్లాలోని పాఠశాలలలు, కళాశాలలన్నిటికీ ఈ నెల 19 నుండి 31వ తేదీ వరకూ సెలవులు ప్రకటించామన్నారు. విద్యార్థులు కరోనా వైరస్ సోకకుండా ఇంటివద్దే ఉండాలని, సెలవులలో ప్రయాణాలు చేయవద్దని ఆయన కోరారు. వేడి ఎక్కవగా ఉండే మన దేశంలో వైరస్ వ్యాపించదని, కొన్ని చిట్కాలు పాటిస్తే వైరస్ సోకదని సామాజిక మాద్యమాల్లో వస్తున్న సూచనలు శాస్త్రీయంగా నిరూపితమైనవి కావని, ప్రజలు వైద్య ఆరోగ్య శాఖ సూచించిన ఆరోగ్య జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. చేతులను సబ్బు, శానిటైజర్ లతో తరచు శుబ్రపరచుకోవాడం, వ్యక్తుల మద్య దూరం పాటించడం, అనారోగ్య సూచనలు ఉన్నవారు ఇంటికే పరిమితమై జాగ్రత్తలను పాటించడం వైరస్ నిరోధానికి అత్యవసరమన్నారు. ప్రజలు అన్ని వేళలా మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రయాణాలు చేసేపుడు, జలుబు,దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కలిగిన వారు సామీప్యంలో ఉన్నపుడు వాటిని తప్పక వాడాలన్నారు. అలాగే వాడిన మాస్కులను రోడ్ల పైన, పబ్లిక్ ప్రదేశాలలో ఎక్కడపడితే అక్కడ పడేయరాదని, వాటిని సక్రమమైన పద్దతిలో డిస్పోజ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలో కోరోనా వైరస్ సోకకుండా అన్ని ప్రామాణిక జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించామని, ఉద్యోగులు తప్పని సరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాలనే నిబంధన సడలించామని తెలిపారు. అనుమానిత లక్షణాలు ఉన్న ఉద్యోగులకు సెలవు ఇచ్చి హోమ్ ఐసోలేషన్ పాటించేలా చూడాలని జిల్లా అధికారులను కోరామన్నారు. విదేశాల నుండి జిల్లాకు వచ్చే వ్యక్తులు 28 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ తప్పని సరిగా పాటించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు గురికావలసి వస్తుందని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలకు ప్రజలందరి నుండి ఆచరణాత్మకమైన సహకారం అవసరమని, వైద్య,ఆరోగ్య శాఖ సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా 084-2361763 హెల్ప్ లైన్ నెంబరుతో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రజలు అనుమాని త లక్షణాలున్న వ్యక్తులు, విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని ఈ కేంద్రాలకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో డియం హెచ్ ఓ డా.బి.సత్యసుశీల కరోనా వైరస్ నిరోధానికి పాటించవలసిన జాగ్రత్తలను వివరించగా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.మల్లిక్, ఎపిడమిక్స్ అధికారి డా.రవికుమార్‌లు చేతులు శుబ్రపరచుకోవలసిన విధానం, మాస్క్ లను ధరించే పద్ధతులను ఉద్యోగులకు, మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరక్టర్ డా.ఎస్.వాణిశ్రీ, డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు