ఆక్వా చెరువులు ;అనుమతుల కొరకు సొమ్ముల వసూళ్లు చేస్తే చట్టపరమైన చర్యలు
తూ. గో ;జిల్లాలో జిల్లాలో ఆక్వా చెరువుల అనుమతుల కొరకు రైతుల నుండి సొమ్ము వసూలు చేసే అధికారులపై ఎసిబి ద్వారా చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. బుధవారంనాడు కలక్టర్ కార్యాలయంలో మత్స్య శాఖ జిల్లా స్థాయి నమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆక్వా చెరువుల అనుమతులకు సంబంధించి మండల స్థాయిలలో అపరిష్కృతంగా ఉన్న ధరఖాస్తులను వెంటనే పరిష్కరించకపోతే సంబంధిత అధికారుల పై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు. ఆక్వా చెరువుల అనుమతులు కొరకు మత్స్యశాఖ అనుబంద శాఖ లైన రెవెన్యూ, ఇరి గేషన్, వ్యవసాయ, పొల్యూషన్, తదితర శాఖల యొక్క రిమార్కుల కొరకు ఆక్వా రైతుల నుండి సొమ్ము వసూలు చేసే సంబంధిత అధికారుల వివరాలు ఎసిబి అధికారులకు తెలియపరిచి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలకు పాల్పడిన ఆరోపణల పై ఉప్పాడ మత్స్యశాఖాభివృద్ధి అధికారి( ఎఫ్ డిఓ) ను గతంలో సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. కమిటీ సమావేశంలో 219 మంచినీటి ఆక్వా చెరువుల ధరఖాస్తులను కలెక్టర్ ఆమోదించినట్లు తెలిపారు. ఉప్పు నీటి ఆక్వా చెరువులకు సంబంధించి 78 ధరఖాస్తులను ఆమోదించి , అనుమతుల కొరకు కోషల్ ఆక్వా ఆధారిటీ చెన్నైకి పంపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గడువు దాటిన ఆక్వా ధరఖాస్తులున్నట్లయితే బాధ్యులైన అధికారుల పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు అంబాజీ పేట మండలం ఇసుకపూడిలో 11ఎకరాల ఆక్వా చెరువుల కొరకు చేసిన ధరఖాస్తులు నిబంధనలకు విరుద్ధంగా వున్నాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గత డిఎల్ సి సమావేశంలో ఆమోదం జారీ చేసినప్పటికి, గడువులోపు బాండులు సమర్పించని ధరఖాస్తులను తిరస్కరించి, కొత్తగా మరల ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌డ్ సి హెచ్.సత్తిబాబు, మత్స్యశాఖ జెడి పి. జయరావు, గోదావరి ఈస్ట్రన్ డివిజన్ ఇడి ఐవి.సత్యనారాయణ, వ్యవసాయశాఖ డిడి విటి.రామారావు, ఎడి గ్రౌండ్ వాటర్ కాకినాడ టివివి.సత్యనారాయణ, పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇఇ రామారావు నాయుడు, మత్స్యశాఖ ఎడి కాకినాడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి