ఇసుక సరఫరా స్థాయి మరింత పెంచాలి ... కొత్త రీచ్ లు వెంటనే తెరవండి ;మంత్రి పిల్లి

  తూ .గో    ;జిల్లాలో ఇసుక సరఫరా స్థాయిని మరింత పెంచేందుకు క్రొత్త రీచ్ లను వెంటనే తెరవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులను కోరారు. - సోమవారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిని పే విశ్వరూప్, పార్లమెంట్ సభ్యులు, శాశన సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇసుక కొరత నివారణ, రైతుల నుండి జరిపిన ధాన్యం కొనుగోళ్లకు చెల్లింపులు, రెండవ పంటకు సాగునీటి సరఫరా, అక్రమ మద్యం విక్రయాల నియంత్రణ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రజలకు ఇసుక తక్కువ ధరలో, డోర్ డెలివరి ద్వారా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరళమైన, పారదర్శకమైన విధానాన్ని చేపట్టిందని, అయితే ఇసుక కొరత, ఇతర కారణాల వల్ల ఆచరణలో ఇసుక సరఫరాలో కొంత జాప్యం , ఇబ్బందులు ఎదురౌతూ, ప్రజల సంతృప్తిని పూర్తిగా అందుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన పలు పనులు కూడా ఇసుక కొరత కారణంగా జాప్యమౌతున్నాయన్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరతకు కారణాలను ఆయన రాష్ట్ర మైనింగ్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఎండి మధుసూధనరావు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో సుధీర్ఘంగా సమీక్షించారు. సమీక్షలో ఎపిఎండిసి యండి మధుసూదనరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబరు 5 నుండి నూతన ఇసుక విధానం చేపట్టిందని, అయితే వరదల కారణంగా నవంబరు 15వ తేదీ వరకూ ఇసుక మైనింగ్ సాధ్యం కాలేదని, వరదలు తగ్గిన నప్పటి నుండి ఇప్పటి వరకూ జిల్లాలో 11.56 లక్షల టన్నుల ఇసుక మైనింగ్ చేసి, 11 లక్షల టన్నులు ప్రజలకు అన్ లైన్ విధానంలో డిస్పాచ్ చేసామని, మరో 90 వేల టన్నులను బల్క్ ఆర్డర్ ల పై సరఫరా చేయడం జరిగిందన్నారు. అలాగే ఉపాధి హామీ పనులకు మరో లక్షా 78 వేల టన్నులు అందుబాటులోకి తెచ్చి, రోజుకు 10 వేల టన్నులు వరకూ సరఫరా చేయడం జరుగుతోందన్నారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం తెరిసిన రీచ్ లకు అదనంగా గుర్తించిన మరో 16 రీచ్ లకు పర్యావరణ అనుమతులు జారీ అవుతున్నాయని, ఈ వారంలో క్రొత్తగా 13 రీచ్ లలో ఇసుక మైనింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే ఉపాధి హామీ పనులకు ఇసుక కొరత రాకుండా కొద్ది రోజుల పాటు బల్క్ ఆర్డర్లు, పొరుగు జిల్లాలకు జరి పై సరఫరాను తాత్కాలికంగా నిలుపదల చేస్తామన్నారు. జిల్లాలో రైతులు తమ పొలాల్లో మెరక తొలగించి తరలించే మట్టి ట్రాక్టర్లను, ఇసుక బట్టీలకు మట్టి రవాణా చేసే వాహనాలను కూడా నిరోధించడం జరుగుతోందని, అలా జరుగకుండా చూడాలని మంత్రి పినిపే విశ్వరూప్ అధికారులకు సూచించారు. పారదర్శకమైన ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నా వివిధ శాఖల మద్య సమన్వయం లేకపోవడంలో పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని అమలాపురం ఎంపి చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, జక్కంపూడి రాజా మంత్రుల దృష్టికి తెచ్చారు. జిల్లాలో నెలకొన్న ఇసుక సరఫరా సమస్యను పరిష్కరించేందుకు జిల్లాలో అనుమతులు జారీ అయిన క్రొత్త ఇసుక రీచ్ లలో మైనింగ్ వెంటనే చేపట్టాలని మంత్రులు సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్లు అధికారులకు సూచించారు. జిల్లాలో సాగులో ఉన్న రెండవ పంటలు కీలక దశలో ఉన్న దృష్ట్యా శివారు భూములతో సహా మొత్తం సాగు విస్తీర్ణంలో ఎటువంటి నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఉపముఖ్యమంత్రి ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యాంలో పైపులు ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల నీటి సరఫరా తగ్గిందని ఇరిగేషన్ ఇంజనీర్లు తెలుపగా, సదరు అంశం పై జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి పోలవరం ఇంజనీర్లు, ఈఎన్ సితో అప్పడే మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఏలేరులో తగిన నీటి నిల్వలు ఉన్నందున, ఏలేరు, పిబిసి ఆయకట్టులో శివారు భూములకు కూడా నీరు అందేలా ఎక్కువ డ్యూటీలో నీరు విడుదల చేయాలని కాకినాడ ఎంపి వంగా గీత, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గం పేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధికారులను కోరారు. ఈ రైతుల ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు చెల్లింపులలో జాప్యం పై సమీక్షలో జిల్లాలో ఇప్పటి వరకూ రైతుల నుండి 12.92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోచేసామని, దాదావు 1,802 కోట్ల మేరకు రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని, మరో 477 కోట్లు రానున్న నాలుగు రోజుల్లో చెల్లించ నున్నామని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానం కనుగుణంగా జిల్లాలో మద్యం షాపుల సంఖ్యను 20 శాతం మేరకు, 542 నుండి 432 షాపులకు తగ్గించడం జరిగిందని అక్రమ మద్యం, బెల్ట్ షాపుల నిరోధానికి జిల్లాలో పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖల సమన్వంతో పనిచేస్తూ ఇప్పటి వరకూ 109 బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్-2 బి.రాజకుమారి, ఇరిగేషన్, మైనింగ్, వ్యవసాయ, ఇంజనీరింగ్ , ఎక్సైజ్, పౌరసరఫరాల శాఖల అధికారులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు